ఇది సినిమా టైమ్!
ఎన్నికల హడావిడి తగ్గి, ఫలితాలు విడుదలై, ప్రభుత్వాలు ఏర్పడ్డాక రాజకీయనాయకులు, పార్టీల కార్యకర్తలు హమ్మయ్య అనుకుంటూ ఊపిరిపీల్చుకుంటారు. కానీ ఈ సారి ఈ తంతు పూర్తయినందుకు అత్యధికంగా ఆనందించింది పవన్‌కల్యాణ్ అభిమానులు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర వహించారు కొణిదెల పవన్‌కల్యాణ్. జనసేన పార్టీని ప్రారంభించి, బహిరంగ సభలను ఏర్పాటు చేసి రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఆ కారణంగా కొన్నినెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ‘అత్తారింటికి దారేది’ విజయం తర్వాత వెంటనే ‘గబ్బర్‌సింగ్ 2’ మొదలవుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ పవన్ ఎన్నికలతో బిజీ కావడంతో ఆ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లడానికి ఆలస్యమైంది. పవన్‌కల్యాణ్ కెరీర్‌లో ‘పులి’, ‘తీన్‌మార్’, ‘పంజా’ తర్వాత విడుదలైన సినిమా ‘గబ్బర్‌సింగ్’. హిందీలో సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్’కు రీమేక్ ఇది. ‘గబ్బర్ సింగ్’ విజయాన్ని ‘అత్తారింటికి దారేది’ కొనసాగించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ పైరసీ గొడవలను అధిగమించి బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డుల్ని సృష్టించింది. ఈ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది అవుతోంది.
పవన్ కల్యాణ్ కెరీర్‌లో తొలిసారి మరో అగ్ర హీరోతో కలిసి తెర పంచుకుంటున్నారు. వెంకటేష్, పవన్‌కల్యాణ్ కలిసి ‘గోపాల గోపాల’లో నటిస్తున్నారు. కిశోర్ పార్థాసాని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ‘గోపాల గోపాల’తో బిజీగా ఉన్నారు. హిందీలో ఘన విజయాన్ని మూటగట్టుకున్న ‘ఓ మై గాడ్’కు రీమేక్ ఇది. మరో వైపు ‘గబ్బర్‌సింగ్ 2’ పనులు కూడా ముమ్మరమవుతున్నాయి. మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు పవన్.
మరమరాలు........
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన పవన్ 18 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’, ‘బద్రి’, ‘ఖుషి’, జల్సా, ‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలన్నీ ఆయన ఛరిష్మాకు కారణమయ్యాయి. యువ హీరోల్లో ఎక్కువమంది పవన్‌కల్యాణ్ అభిమానులున్నారు. పవన్‌కల్యాణ్ ‘జానీ’కి దర్శకత్వం చేశారు. ‘జానీ’కి యాక్షన్ విభాగంలోనూ పనిచేశారు. ‘పంజా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల్లో పాటలు పాడారు. మార్షల్ ఆర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. ఏ మాత్రం సమయం దొరికినా తన ఫామ్ హౌస్‌లో వ్యవసాయం చేసుకోవడానికి ఇష్టపడతారు పవన్.
Source : Andhrajyothy News Paper