శరత్‌చంద్ర ఛటర్జీ ప్రఖ్యాత నవల ‘దేవదాస్’ స్ఫూర్తితో బాలీవుడ్ డైరెక్టర్ సుధీర్ మిశ్రా ‘ప్యాస్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే కథానాయకుడి పాత్రకు రాహుల్ భట్ (‘అగ్లీ’ ఫేమ్)ను ఎంపిక చేసిన ఆయన తాజాగా హీరోయిన్ల పాత్రలకు రిచా చద్దా, అదితి రావ్‌ను తీసుకున్నాడు. పార్వతి, చంద్రముఖి పాత్రల ప్రేరణతో తయారుచేసిన పాత్రలను ఆ ఇద్దరూ పోషిస్తున్నారు. లక్నోలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మూడు నెలల్లో పూర్తయ్యే సినిమా మొత్తాన్నీ అక్కడే చిత్రీకరించనున్నారు. చాలా కాలంగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొదట హీరోయిన్ల పాత్రలకు లారా దత్తా, చిత్రాంగదా సింగ్ పేర్లు వినిపించాయి. కొద్ది రోజుల క్రితం కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దక్షిణాదిన కాజల్ బిజిగా ఉండటంతో కాల్షీట్ల సమస్య ఎదురైందనీ, అందుకే ఆమె ఈ సినిమా తప్పుకుందనీ బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమెకు ఆఫర్ చేసిన పాత్రకు ఇప్పుడు అదితి రావ్‌ను తీసుకున్నారు. చంద్రముఖి పాత్రకు శాసీ్త్రయ నృత్యకారిణి అయిన అదితి సరిగ్గా సరిపోతుందని సుధీర్ భావించాడనీ, ఇదివరకే ఆమెతో ‘యే సాలీ జిందగీ’ సినిమాకు పనిచేసిన ఉండటం వల్ల కూడా ఆమెవైపు ఆయన మొగ్గాడనీ అంటున్నారు. కాగా ఇది ‘దేవదాస్’కు రీమేక్ కాదనీ, ఆ సినిమాకు ట్రిబ్యూట్ అనీ సుధీర్ చెప్పాడు. బలమైన రొమాంటిక్ కోణం ఉన్న పొలిటికల్ థ్రిల్లర్‌గా దీన్ని తీస్తున్నామని ఆయన తెలిపాడు.
Source : andhrajyothy news paper