విజయ్ సార్ సినిమా చేయడం కోసం ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నా - శ్రుతి హాసన్
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ 58వ సినిమా నుంచి అందాల తార శ్రుతి హాసన్ తప్పుకుందనే వార్తలు కొంత సమయం పాటు అంతర్జాలంలో హల్‌చల్ చేశాయి. దీనికి కారణం ట్విట్టర్‌లో ఆమె చేసిన ఓ వ్యాఖ్య. విజయ్ హీరోగా చింబుదేవన్ రూపొందించ తలపెట్టిన చిత్రంలో నాయికగా నటించేందుకు సంతకం చేసింది శ్రుతి. అయితే ఆగస్ట్ 29న ఆమె ‘‘పరిస్థితులు మారాయి. పెద్దదేమీ లేదు. ఏం జరగడానికైనా ఓ కారణముంటుంది. దాన్ని మనం కనుక్కోవాలి’’ అంటూ ట్వీట్ చేసింది. ఇంకేముంది! విజయ్ సినిమా నుంచి తప్పుకున్నందువల్లే ఆమె ఆ వ్యాఖ్యలు చేసిందని విజయ్ అభిమానులు అభిప్రాయపడ్డారు. దీనిపై ఆమెకు ప్రశ్నలు సంధించేశారు. దీంతో తన వ్యాఖ్యలు ఎలాంటి అపార్థాలకు దారితీశాయో అర్థమైన శ్రుతి ఒక రోజు తర్వాత ‘‘నేను సాధారణంగా జీవితంలో వచ్చే మార్పుల గురించి నా మునుపటి ట్వీట్ ద్వారా చెప్పాను. దాని గురించి ఇంత అతిగా, ఇంకోరకంగా ఆలోచిస్తారని అనుకోలేదు’’ అని తెలిపింది. మరో రెండు రోజుల తర్వాత ‘‘చింబుదేవన్, విజయ్ సార్ సినిమా చేయడం కోసం ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నా. ఇకపై నా సూడో ఫిలసాఫికల్ ట్వీట్ వల్ల ఏర్పడిన వదంతులు ఆగిపోతాయని ఆశిస్తున్నా’’ అని ట్వీట్ చేసింది శ్రుతి.తాజాగా విశాల్ సరసన ఆమె నటిస్తున్న ‘పూజ’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళికి విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.