ఆరు కథల సమాహారం
రవిబాబు, అర్చన, వినోద్‌కుమార్, భానుశ్రీ మెహ్రా, శివాజీరాజా కీలక పాత్రధారులుగా శ్రీ పద్మావతి ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ నిర్మించే చిత్రం గురువారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉదయభాస్కర్ జాస్తి సమర్పణలో ఆర్. పద్మజ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు బి.గోపాల్ క్లాప్‌నిచ్చారు. భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు ప్రభాకరన్ మాట్లాడుతూ ‘‘దర్శకునిగా నాకు ఇది మూడో చిత్రం. ఇందులో ఉన్న ఆరు కథల్ని ఏడో కథ ముందుకి నడిపిస్తుంది. ఇది చక్కని థ్రిల్లర్. శుక్రవారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తి చేస్తాం’ అని తెలిపారు. ‘‘ఆరు కథల సమాహారం ఈ చిత్రం. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యత గల పాత్ర చేస్తున్నాను’’ అని అర్చన చెప్పారు. ఈ చిత్రంలో ఎంతమంది నటులున్నా ఇటువంటి టిపికల్ కథకి దర్శకనిర్మాతలే హీరోలని ఉత్తేజ్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత ఆర్.పద్మజ, జై సింహా, హరిత, పవన్, సంగీత దర్శకుడు తారక రామారావు, మాటల రచయిత పార్వతీచంద్ తదితరులు పాల్గొన్నారు. రవిప్రకాశ్, సత్యకృష్ణ, సందీప్తి, ప్రియాంక, పవన్, రాహుల్, విష్ణుప్రియ ఇతర పాత్రలు పోషించే ఈ చిత్రానికి కెమెరా: ఉదయభాస్కర్ జాస్తి, సంగీతం: తారక రామారావు, ఎడిటింగ్: రమేశ్.