మళ్లీ దక్షిణాదికి అసిన్?
రెండేళ్ల క్రితం వరకు బాలీవుడ్‌లో అసిన్ అగ్ర నాయిక అయినట్లేనని ఆమె అభిమానులు ఆశపడ్డారు. కానీ రెండేళ్ల తర్వాత చూస్తే, అగ్ర నాయిక పోటీదారుగా ఆమెను ఎవరూ పరిగణించట్లేదు. పైగా అక్కడ ఆమె భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయింది. అభిషేక్ బచ్చన్‌తో చేస్తున్న ‘ఆల్ ఈజ్ వెల్’ ఒక్కటే ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్. అది మినహా కొత్త ఆఫర్లేవీ ఆమెకు లేవు. ఇక్కడో సంగతి గమనించాలి. బాలీవుడ్‌కు వెళ్లకముందు ఆమె చేతినిండా సినిమాలుండేవి. అక్కడకు వెళ్లాకే ఆమె చాలా తక్కువ సినిమాలు చేసింది. 2001 నుంచి 2008 వరకు ఏడేళ్ల కాలంలో ఆమె 17 చిత్రాల్లో నటిస్తే, బాలీవుడ్‌కు వెళ్లాక 2008 నుంచి ఈ ఆరేళ్ల కాలంలో ఆమె చేసింది 7 సినిమాలే. దీంతో ఆమె తన ఆలోచనా ధోరణి మార్చుకుందనీ, తిరిగి దక్షిణాదికి వచ్చేందుకు ప్లాన్ చేస్తోందనీ వినిపిస్తోంది. చివరిసారిగా విజయ్‌తో మూడేళ్ల క్రితం తమిళ చిత్రం ‘కావలన్’లో కనిపించిన ఆమె తన మైక్రో-బ్లాగ్ సైట్‌లో ‘‘ప్రత్యేకం: అసిన్ దక్షిణాది అభిమానులందరికీ మంచి వార్త! సరైన టైమ్ వచ్చినప్పుడు దాన్ని (ఆ సినిమాను) ప్రకటిస్తాం’’ అని తెలపడం విశేషం. దీన్నిబట్టి త్వరలోనే ఆమె తిరిగి దక్షిణాదికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న మాటే.Source : Andhrajyothy News paper