ఐదు కథలతో, ఆర్యన్ రాజేశ్, కృష్ణుడు, మాదాల రవి, చిన్నా, ఉత్తేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న ‘పంచముఖి’ సినిమా పాటలు మార్కెట్‌లో విడుదలయ్యాయి. ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చల్లా భానుకిరణ్ దర్శకుడు. సుమన్, ప్రమోద్, మోహన్ బల్లేపల్లి, జయసూర్య, భాను సంగీతం సమకూర్చగా, తైదల బాపు, జయసూర్య, బండి సత్యం, భానుకిరణ్ సాహిత్యం అందించారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో హీరో అల్లరి నరేశ్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. కొంతకాలంగా తెలుగులో హారర్ సినిమాలకు చక్కని ఆదరణ లభిస్తోందనీ, ఐదు భిన్న కథలతో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలనీ నరేశ్ ఆకాంక్షించారు. రాజేశ్ మాట్లాడుతూ ‘‘ఇందులో నిజంగా భిన్నమైన పాత్ర చేశాను. ఇది ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించే హారర్ సినిమా’’ అన్నారు. దర్శకుడు భానుకిరణ్ మాట్లాడుతూ ‘‘యథార్థంగా జరిగిన ఐదు కథల సమాహారం ఈ చిత్రం. ఇందులో ముఖ్యంగా ఐదు పాత్రలుంటాయి. ఒక పాత్రతో ఇంకో పాత్రకు సంబంధం ఉంటుంది. అదేంటన్నదే కీలకం. ఐదుగురు సంగీత దర్శకులు చక్కని బాణీలిచ్చారు. రీరికార్డింగ్ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే ప్రధాన బలమని నిర్మాత కిరణ్ తెలిపారు. అనుకున్న బడ్జెట్‌లో నలభై రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశామన్నారు. ఇందులో సైకలాజికల్ ప్రొఫెసర్‌గా నటించానని మాదాల రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు వీరశంకర్, నటులు ఉత్తేజ్, మనోజ్ నందం, సంగీత దర్శకులు, గేయ రచయితలు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
source : Andhrajyothy article